ఎరుమేలి నుండి పద్దెనిమిది మెట్లు దాకా

భక్తులు శబరిమల ప్రయాణిస్తున్నప్పుడు ఆ మార్గంలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాల వివరాలను దిగువన చూద్దాం.

ఎరుమేలి
శబరిమలకి వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పక దర్శించే ప్రదేశం ఎరుమేలి. మహిషి హతమైన ప్రాంతమైన ఈ ఎరుమేలి మత సామరస్యానికి కూడా పేరుగాంచింది. ఇక్కడికి చేరుకున్న అనంతరమే అయ్యప్ప స్వామివారు మహిషిని అంతమొందించినట్టు భక్తులు విశ్వసిస్తుంటారు.మహిషితో యుద్ధం చేసేటప్పుడు అయ్యప్ప స్వామి తాండవం చేసిన సంఘటనకు గుర్తుగా పేట్టథుల్లాల్ నాట్యం, కర్మకాండ నృత్యం లాంటివి నిర్వహిస్తుంటారు. ప్రజలు ముఖాలకు రంగులు అద్దుకుని కూరగాయల్లాంటి వర్గీకరించిన వస్తువులతో నిండిన దుప్పటిని భుజాలపై మోసుకుని వెళ్తారు. 'పేట్ట' నాట్యంతోపాటు సంగీతం మరియు న్యత్యం చేస్తూ ఊరేగింపు నిర్వహిస్తారు. ఇదంతా ఎరుమేలి వద్ద అయ్యప్ప స్వామి దేవాలయం చుట్టూ వెళ్ళిన తరువాత ముగుస్తుంది.

అటవీ ప్రయాణం లేదా పాదయాత్ర
పేట్ట థుల్లాల్ నాట్యం తరువాత భక్తులు అటవీ ప్రాంతం గుండా తమ యాత్రను కొనసాగిస్తారు. ముందుగా కొట్టపాడి చేరుకుంటారు. ఈ ప్రాంతంలోనే అడవి జంతువుల నుండి భక్తుల్ని రక్షించేందుకుగానూ అయ్యప్ప స్వామి వపరన్‌కి బాధ్యత అప్పగించినట్లుగా చెబుతుంటారు.

పెరుర్తోడు
అయ్యప్ప స్వామివారు అడవులలో సంచరించినప్పుడు చిన్న యేరు అయిన పెరుర్తోడు ఒడ్డున కాసేపు సేదదీరినట్లుగా భక్తుల విశ్వాసం. అందుకనే భక్తులు కూడా శబరిమల యాత్రలో భాగంగా పెరుర్తోడులో శరీరాలను శుభ్రపరచుకుని విశ్రాంతి తీసుకుంటుంటారు.

ఇరుంబూనిక్కర
ఇక్కడ రెండు ఆలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో భక్తులు పూజలు చేసిన అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుంటుంటారు. అలాగే టేకు తోటల్లో ట్రెక్కింగ్‌కి కూడా వెళ్తుంటారు. ఇక్కడ కొన్ని దుకాణాలు కూడా ఉంటాయి.

కాలకేట్టి
ఈ ప్రాంతంలో శివుడి ఆలయం ఉంది. అయ్యప్ప స్వామివారు మహిషితో యుద్ధం చేస్తుండగా శివుడు తన ఎద్దుతోపాటు ఓ చెట్టు నుంచి చూసిన ప్రదేశంగా భక్తుల నమ్మకం.

ఆళదా నది
మానవ స్థావరాలుండే చివరి ప్రాంతం అళదా నది. అయ్యప్ప స్వామివారు మహిషితో యుద్ధం చేస్తున్నప్పుడు బాధగా మహిషి కార్చిన కన్నీరే నదీరూపమైనదట. ఆ నదియే అళదా నది. ఈ నదిలో స్నానం చేసి భక్తులు నది నుండి ఒక రాయిని తీసుకు వెళతారు. ఆ రాతిని మహిషి కళేబరాన్ని పూడ్చిన చోటైన 'కళిద ముకుంద' పడేసి వెళ్తుంటారు. లోతైన అళదా నదీ ప్రాంతాన్ని దాటిన తరువాత పెరియార్ టైగర్ రిజర్వ్ అనే ప్రాంతంలోకి ప్రవేశిస్తారు. ఆపై ముందుకి వెళ్లాలంటే తప్పకుండా వెంట నీటిని తీసుకెళ్లాలి. ఇక్కడి నుంచి చాలా కష్టసాధ్యమైన ప్రయాణానికి కూడా సిద్ధపడాలి. ఈ ప్రదేశంలో భక్తులకి ఆహారం మరియు అవసరమైన సహాయం చేసేందుకు ఇక్కడ కొన్ని చారిటబుల్ ఆర్గనైజేషన్లు తమ సేవల్ని అందిస్తుంటాయి.

ఆళద మేడు
ఈ ప్రదేశంలో ప్రయాణం అయ్యప్ప భక్తులకు అగ్నిపరీక్ష లాంటిదే. ఈ కొండ ఏటవాలు ఎక్కువగా ఉండటం వల్ల భక్తులు చాలా అప్రమత్తంగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఇది అళదా నదికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.

కళిద ముకుంద
ఈ ప్రాంతాన్ని మహిషి మృత కళేబరాన్ని పడవేసిన చోటుగా భక్తులు విశ్వసిస్తుంటారు. మహిషి శరీరం దాచబడింది కాబట్టి ప్రజల సమస్యలకు కారణం కాదని నమ్ముతుంటారు. ఈ జ్ఞాపకంగా అళదా నదిలో మునిగి వెంట తీసుకువచ్చిన రాయిని భక్తులు ఈ ప్రదేశంలో విసిరి వెళ్తుంటారు.

ఇంచిపరకొట్ట
అయ్యప్ప భక్తులు విశ్రాంతి తీసుకునే ప్రదేశంగా ఈ ప్రాంతం గుర్తింపు పొందింది. ఇక్కడ భక్తులు ఆహార పదార్థాలను వండుకుని తింటారు.

కరియిలమ్ తోడు
అత్యంత సుందరమైన ఈ ప్రదేశంలో వాతావరణానికి భక్తులు ఆనందపరవశులవుతూ.. అడవుల అందాన్ని ఆస్వాదిస్తూ యాత్రను కొనసాగిస్తారు. మరికొందరు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటుంటారు.

పుదుస్సేరీ-ముక్కుళీ
ఈ ప్రదేశంలో అటవీ జంతువుల నుండి ఎలాంటి ప్రమాదం ఉండదు కాబట్టి రాత్రిపూట ఇక్కడ బస చేయవచ్చు. శబరిమల యాత్రలో భాగంగా భక్తులు ఇక్కడ విశ్రాంతి తీసుకుని తరువాతి రోజు తమ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు.

కరిమల
ఎనిమిది వరుసల శ్రేణితో ఉండే కరిమలను ఒకేసారి ఎక్కడం సాధ్యంకాదు. సాధారణంగా ప్రజలు, భక్తులు మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుని ఒక్కో వరుస ముందుకి వెళ్తుంటారు. కరిమల పర్వతం పై భాగాన కరిమలనాథన్ ఆలయం ఉంటుంది. ఇక్కడ అనేక బావులు, సరస్సులు కూడా ఉన్నాయి. ఈ పర్వతం కిందికి దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దిగాల్సి ఉంటుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం బారిన పడాల్సి ఉంటుంది.

వలియానవట్టమ్
విశ్రాంతి తీసుకునేందుకు, వంట వండుకునేందుకు ఈ ప్రదేశం చాలా అనువుగా ఉంటుంది. వెళ్లిపోయిన ఆత్మల కోసం ఈ ప్రదేశంలో బలిపిండదానం కూడా చేస్తుంటారు. దీన్నే పూర్వకాలంలో పంపా నదిగా పిలుస్తుండేవారు. ఇక్కడ ఏనుగులు దప్పిక తీర్చుకుంటాయట. ఇక్కడినుండి శబరిమలను చేరుకునేందుకు రెండు దారులున్నాయి. ఒకటి పంపానదికి ఉపమార్గంలో సాగిపోయే దారి కాగా, మరొకటి నేరుగా పంపానదీ మార్గంగుండా సాగిపోయే మరో దారి.

పంప
పంపా నదిలో స్నానం చేయటం వల్ల అటవీ ప్రాంతంలో ప్రయాణం సునాయాసంగా సాగిపోతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ ఆచారాలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో అనేక ఆలయాలున్నాయి. వాహనాల్లో కూడా ఈ ప్రాంతానికి నేరుగా చేరుకోవచ్చు. అయితే రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది.

నీలిమల
నిటారుగా ఉన్న ఈ పర్వతం పైకి వెళ్లే కొద్దీ ప్రయాణం చాలా నెమ్మదిగా, నిలకడగా సాగాలి. అలాగే ప్రతి ఒక్కరూ తమ తమ ఆరోగ్యాల్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణం సాగించాలి. సాధ్యమైనంత ఎక్కువగా వైద్య సౌకర్యాల్ని ఉపయోగించుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది.

అప్పాచిమేడు
కరుడవన్ ఉన్న ప్రదేశమే ఈ అప్పాచిమేడు. దేవతల మిత్ర చెడు ఆత్మలు పరిపాలించిన ఈ ప్రదేశంలో దుర్దేవతల కోసం బియ్యపు ఉండలను విసురుతుంటారట. నిటారుగా ఉన్న ఈ ప్రదేశంలో పైకి వెళ్లేందుకు చెడు ఆత్మలకు నమస్కారం చేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

శబరీపీఠం
శ్రీరాముని కోసం శబరి నిరీక్షించి, విముక్తి పొందిన ప్రదేశమే ఇది. ఇక్కడే శబరి పర్వతంగా మారగా.. అయ్యప్ప స్వామి ఈ పర్వతంలోనే కొలువై ఉండటంతో శబరిమలగా ప్రసిద్ధిగాంచింది. శబరీ పీఠంలో పందళ్‌ రాజవంశీయులు విద్యాభ్యాసం నేర్చుకొన్నారు.

మరకూట్టమ్
శబరిమల స్వామివారి ఆలయంలోకి ప్రవేశించేందుకు సాధారణంగా ఈ ప్రదేశం నుంచే క్యూలైన్లు మొదలవుతుంటాయి.

శరమ్ గుత్తి
అయ్యప్ప స్వామి ఆయన సేనలు ఆయుధాలను వదలి వెళ్లిన ప్రదేశమే ఇది. భక్తులు ఎరుమేలి నుంచి తమ వెంట తెచ్చుకున్న బాణాలను ఇక్కడ వదిలి వెళ్తుంటారు. యాత్రలో దీక్షాదండముగా భద్రపరిచి తెచ్చిన శరములను ఇక్కడే వున్న ఠాణి వృక్షములో గుచ్చుతారు. ముఖ్యంగా కన్నెసాములు వెంట తెచ్చిన ఒక బాణాన్ని ఇక్కడ ఉంచుతారు. ఇక్కడినుంచి స్వామివారి సన్నిధానానికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది.

పద్దెనిమిది మెట్లు
సన్నిధానం వద్ద ఉన్న పద్దెనిమిది మెట్లను "పదునెట్టాంబడి" అని అంటారు. ఈ పద్దెనిమిది మెట్లను అధిరోహించే సమయంలో స్వామి మాల ధరించిన వారి నెత్తిన ఇరుముడి తప్పకుండా ఉండాలి. ఇరుముడి లేకుండా పద్దెనిమిది మెట్లు ఎక్కరాదు. ఎక్కేముందు మెట్లకు ముందుగా కొబ్బరికాయను పగులగొట్టి భక్తులతో కలిసి ముందుకు సాగాలి.
40 రోజులు దీక్ష తీసుకొని ఇరుముడి ధరించినవారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారని కధనం. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. సన్నిధానానికి, 18 మెట్లకు నమస్కరిస్తూ స్తోత్రాలు పఠిస్తూ మెట్లను ఎక్కుతారు.
ఈ ఆలయంలో స్వామి కొలువైన సందర్భంగా 18 వాయిద్యాలను మ్రోగించారట. సన్నిధానంలో "పానవట్టం"పైన అయ్యప్ప కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు. స్వామియే శరణం అయ్యప్ప స్వామి కూర్చున్న తీరు శివలింగాన్ని తలపిస్తుందని. ఒంపు తిరిగిన ఎడమచేయి మోహిని అవతారాన్ని తెలియజేస్తుందని చెబుతారు.

దర్శనం
జెండా స్తంభం నుండి రద్దీని నివారించేందుకు ఎత్తైన వంతెన నుండి భగవంతుడిని దర్శించుకోవచ్చు.

మాలికాపురం
మాలికాపురతమ్మ మరియు ఇతర దేవతలను ఇక్కడ దర్శించుకుని ప్రార్ధన చేయవచ్చు.

© Copyright 2015 Manoramaonline. All rights reserved.