అయ్యప్ప భక్తులచే నిర్వహించబడే ధార్మిక నియమనిష్ఠలు

 శబరిమల దేవుడు ధర్మ షష్ఠ. అయ్యప్ప స్వామి ధర్మ షష్ఠలో ఐక్యమయ్యాడని పురాణ గాథ. తన భక్తుల కష్టాలను కడతేర్చే దేవుడిగా అయ్యప్ప స్వామిని పరిగణిస్తుంటారు. శబరిమల యాత్రను 41 రోజులపాటు దీక్ష పాటించిన అనంతరమే చేపడతారు. తొలిసారి యాత్ర చేపట్టేవారు, చాలాసార్లు యాత్ర చేసిన భక్తులు కూడా దీక్షను పాటించాల్సి ఉంటుంది. విధి నిర్వహణకోసం ఆలయంలో నియమితులైన అధికారులు, నెలవారీ పూజలకోసం మందిరాన్ని తెరిచినప్పుడు స్వామిని సందర్శించే భక్తులు సైతం దీక్ష చేపట్టాల్సిందేనని ఇటీవల ఆలయంలో కనుగొన్న జ్యోతిష్య సంబంధ గ్రంథాలు చెప్పాయి.

మలయాళ మాసం వృశ్చికం తొలిరోజున అంటే సూర్య భగవానుడు సద్గతి మార్గాన పయనాన్ని ప్రారంభించిన సమయంలో శబరియాత్రకు దీక్ష మొదలవుతుంది. భక్తులు సూర్యోదయాత్పూర్వమే స్నానమాచరించి, అయ్యప్పస్వామి ప్రతిమను కలిగిన పవిత్ర కంఠహారాన్ని ధరించి జీవన సుఖాలను త్యజించాలి. భక్తులు బ్రహ్మచర్యాన్ని పాటించి పూర్తి శాఖాహారాన్ని ఆరగించాలి. క్షౌరము తీసుకోకూడదు.పవిత్ర హారాన్ని ధరించిన తర్వాత, భక్తుడిని స్వయంగా అయ్యప్పగా పరిగణిస్తారు. మందిరం వైపు దారితీసే 18 మెట్లను పవిత్రమైనవిగా పరిగణిస్తారు. దేవుడికి అర్పించవలసిన నూనెతో పూరించిన కొబ్బరికాయలు, ఇతర వస్తువులతో కూడిన ఇరుమడిల పవిత్ర మూటను భక్తులు తమ తలపై ఉంచి మోసుకెళ్లాలి.

18 మెట్లను ఎక్కుతున్నప్పుడు లేదా మందిరం వైపు తరలి వెళుతున్నప్పుడు భక్తులు ఇతర భక్తులను తోసుకుంటూ వెళ్లకూడదు. క్రమశిక్షణతో ముందుకు సాగాలి. దర్శనానికి కూడా క్రమపద్ధతి ఉంది. మందిరంలోని ఆగ్నేయ మూలలోని వినాయకుడిని, ఆదిశేషువును, మలికప్పురం దేవతను తొలుత దర్శించుకోవాలి. దర్శనం తర్వాత మొక్కులు చెల్లించాలి. వీటిలో విగ్రహాన్ని నెయ్యితో అభిషేకించడం చాలా ముఖ్యమైనది. మధ్యాహ్న అనంతర పూజల సమయంలో ఇలా చేయకూడదు.
ప్రతి పూజ వైవిధ్యంతో కూడి ఉంటుంది. ప్రాతః కాలంలో అంటే తొలి సంజ దాటకముందే నిన్నటి రోజు పూజాదికాలతో ఉన్న విగ్రహానికి వివిధ పవిత్ర ద్రవాలతో అష్టాభిషేకం చేయిస్తారు. ఈ సమయంలో స్వామికి తిరుమధురం (మూడు రకాల తీపి పదార్థాలు) సమర్పిస్తారు. కొబ్బరిపాలు, బెల్లంలో వరిబియ్యం కలిపి చేసే పాయసాన్ని, అరవన (అయ్యప్ప ఆలయాల్లో బియ్యం, బెల్లంతో చేసే ప్రత్యేక తీపి పదార్థం), వెల్లను స్వామివారికి సమర్పిస్తారు.

ఆలయంలో ప్రవేశించేటప్పుడు భక్తులందరూ నియమనిబంధనలను నిష్టగా పాటించాలి. 10 నుంచి 50 సంవత్సరాల వయసున్న మహిళలు ఆలయంలోకి ప్రవేశించకూడదు. ఎందుకంటే షష్ట దేవుడు బ్రహ్మచారి. పంతాళం రాజ కుటుంబ ప్రతినిధులు 18 మెట్లను ఎక్కటప్పుడు ఇరుమడితో కూడిన ప్రత్యేక మూటను మోసుకెళ్లవలసిన అవసరం లేదు. రాజు సమక్షంలోనే స్వామివారిని చందన పూతతో అభిషేకిస్తారు. దీంతో మకరవిళక్కు(శబరిమల యాత్ర ముగింపు పూజ) ముగుస్తుంది.

మరకవిళక్కు పూజ కోసం వచ్చే తంత్రిని 18 మెట్ల వరుస వద్ద ప్రధాన పూజారి స్వీకరించి అతడి పాదాలను కడుగుతారు.
మండలపూజ మరియు మకర విళక్కు (మకర జ్యోతి) రెండూ ఇక్కడ అత్యంత ముఖ్యమైన ఆచారాలు. మలయాళ మాసం ధను నెలలో 11వ తేదీన మండలపూజను నిర్వహిస్తుంటారు. మండల ఆరాధన రోజున స్వామివారి విగ్రహాన్ని మహారాజు కానుకగా ఇచ్చిన బంగారు ఆభరణాలతో అలంకరించి పూజలు నిర్వహిస్తారు.శీతాకాలం ముగింపుకు గుర్తుగా మకర విళక్కు (మకర జ్యోతి) మకర సంక్రాంతి రోజున వస్తుంది. పవిత్రమైన ఆభరణాలు, నగలతో అలంకరించబడిన దేవతకు సూర్యాస్తమయం సమయంలో ప్రత్యేక ఆరాధన చేస్తుంటారు. ఈ సమయంలో దేవాలయం చుట్టూ దీపాలను వెలిగిస్తారు. అంటే దీపారాధన చేస్తారు.
ఆభరణాలు మరియు నగలను దీపారాధన పూజలో ఉపయోగించేందుకుగానూ పంథలమ్ ప్యాలెస్ నుంచి ఊరేగింపుగా తీసుకుని వస్తారు. మకరవిళక్కు (మకర జ్యోతి) ప్రారంభం అయిన తర్వాత మూడు రోజులపాటు వరుసగా మాలికాపురం దేవతకు ఊరేగింపు నిర్వహిస్తారు.

మలయాళ మాసం మెడం తొలి రోజున విష్ణు దర్శనం చేసుకుంటే శుభప్రదంగా భావిస్తారు. అదే విధంగా ఆ సమయంలో పండిన వరిపంటను మొదటి పంటగా దేవుడికి సమర్పిస్తారు. దీనినే నిరపుతరి అంటారు.చిత్తిర ఆట్ట తిరునాళ్ మరియు ఫంగుని ఉత్రం (అయ్యప్ప స్వామి జన్మదినం). మళయాళ మాసం మీనం‌లో వచ్చే ఫంగుని ఉత్రంనాడు ప్రతి యేటా అయ్యప్ప స్వామివారి జన్మదిన వేడుకలు పది రోజులపాటు ఘనంగా జరుగుతాయి.