అన్ని దారులూ స్వామి వైపే

కార్తీక మాసం మొదలైందంటే చాలు "శరణం అయ్యప్ప మమ్ము కావుమయ్యప్ప" అంటూ భక్త కోటి శబరిమల వైపు అడుగులు వేస్తుంటారు. ఎటుచూసినా "స్వామియే శరణం అయ్యప్ప" అంటూ భక్తుల జయ జయ ధ్వానాలు కొండ మొత్తం ప్రతిధ్వనిస్తుంటాయి. ఏ వైపు విన్నా పవిత్ర దీక్షతో స్వామివారికి ఆత్మ నివేదన చేసుకునే భక్తుల అయ్యప్ప శరణుఘోషలే. అన్ని దారులూ స్వామి సన్నిధానానికి వెళ్లేవే అయినా, భక్తులు క్లిష్టమైన వాతావరణంలో సైతం భారమంతా దేవుడిపైనే వేసి ముందుకు సాగిపోతుంటారు. ప్రతి భక్తుడి చివరి మజిలీ మోక్షప్రదుడైన అయ్యప్ప స్వామివారి దర్శనమే.

రాళ్లు రప్పలూ, ముళ్లతో కూడిన దట్టమైన అడవిలో చలి గాలులు కూడా తోడై దారి పొడవునా భక్తులకు అడుగడుగునా పరీక్షలు పెడుతున్నా మొక్కవోని దీక్షతో మునుముందుకే సాగుతారు. స్వామివారి సన్నిధానానికి చేరుకోవటం మినహా ఇలాంటి అవరోధాలు ఎన్ని ఎదురైనా భక్తులకు లెక్కే లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో వేదనకు గురయ్యే ఏడు కారణాలపై నిష్ట కలిగిన భక్తులందరూ దృష్టి పెట్టి వాటినుంచి బయటపడేమని మార్గంగా స్వామిని శరణు వేడుతుంటారు. దీక్షలో ఉన్న ప్రతి ఒక్క భక్తుడు, భక్తురాలు తలపై ఇరుముడి మోసుకుంటూ స్వామి దర్శనానికి తరలివెళ్తారు.

శబరిమల యాత్ర 'ఎరుమేలి'తో ప్రారంభం అవుతుంది. ఇక్కడ అయ్యప్ప స్వామివారు ధనుర్భాణదారియై భక్తులకు దర్శనం ఇస్తుంటాడు. ఇదే ప్రాంతాన్ని మహిషి అంతమైన ప్రదేశంగా కూడా భక్తులు విశ్వసిస్తుంటారు. దున్నపోతు రూపంలో ఉన్న మహిషి ఈ ప్రాంతంలో అనేక అరాచకాలు చేస్తూ భయభ్రాంతులను చేస్తుంటే అయ్యప్ప స్వామివారు ఆమెని అంతమొందించినట్లుగా నమ్ముతారు. ఇక్కడే చూడాల్సిన మరో ప్రదేశం "రుద్రకులం". ఇక్కడి మడుగులోనే మహిషి తుదిశ్వాస విడిచినట్లు చెబుతారు. అయ్యప్ప స్వామివారు ఒక రాత్రి గడిపిన ఓ ఇంటిని కూడా ఇక్కడ చూడవచ్చు. అయ్యప్ప దేవుడు ఉపయోగించిన కత్తి ఉన్న ఈ ప్రదేశంలో ఇటీవల అగ్ని ప్రమాదం సంభవించినా.. స్వామివారి కత్తి సురక్షితంగా బయటపడగలిగింది. ఇదంతా స్వామివారి మహిమేనని భక్తుల విశ్వాసం.

ఇక్కడ వావరు స్వామిని దర్శించుకున్న భక్తులు రకరకాల వేషధారణలతో 'పేట్ట థుల్లాల్' అనే నాట్యం చేస్తారు. మహిషితో యుద్ధం చేసినప్పుడు అయ్యప్ప స్వామివారు చేసిన తాండవం పేరే పేట్ట థుల్లాల్. పూర్వం ధనుర్మాసంలో మాత్రమే నిర్వహించే ఈ నాట్యాన్ని ఇప్పుడు సాధారణ నెలవారీ పూజల్లో కూడా అనుమతిస్తున్నారు. భక్తులు వివిధ రకాల వేషధారణలతో చేసే ఖర్మకాండ నృత్యంగా పిలవబడే పేట్ట థుల్లాల్ నాట్యం ఇప్పుడు ఇక్కడ సర్వ సాధారణం. అయ్యప్ప స్వామివారు పులి పాలు కోసం అడవికి వెళ్ళినప్పుడు ఆయనని అడ్డగించిన ఒక దొంగ అనంతరం స్వామి సన్నిహిత భక్తుడిగా మారాడు. అతడే వావరు స్వామి. 'నన్ను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులందరూ ముందుగా నిన్ను దర్శించుకుంటారు' అని స్వామివారు వావరుడికి వరం ఇచ్చాడని ప్రతీతి. ఈ వావరు స్వామి ఒక ముస్లిం కులస్తుడు. ఈయన ఇక్కడ ఒక మసీదులో కొలువుతీరి ఉన్నాడు. వావరుడి దర్శనానంతరం భక్తులు పేట్ట థుల్లాల్ నాట్యం చేస్తారు. ఈ నాట్యం అనంతరం ప్రతి ఒక్క భక్తుడు తమ వెంట ఒక్కో బాణాన్ని తీసుకుని యాత్రను ముందుకు కొనసాగిస్తారు. బాణం తమవెంట తీసుకున్నారంటే వారందరూ స్వామి అయ్యప్ప సైన్యంలో భాగమని నమ్ముతారు.

యాత్రలో భాగంగా కొట్టపాడిని దాటిన తరువాత పెరుర్తోడు చేరుకుంటారు. ఈ ప్రదేశంలో ప్రవహించే చిన్న యేటిలో భక్తులు స్నానాలు చేస్తుంటారు. మహిషితో అయ్యప్ప స్వామి యుద్ధం చేస్తుండగా పరమశివుడు ఎద్దుతోపాటు 'కాలకేట్టి'లో చెట్టుచాటునుంచి చూసాడని భక్తుల విశ్వాసం. కాలకేట్టి ఆలయ దర్శనం అనంతరం అక్కడికి కొద్ది దూరంలోనే అళదా నదిని చూడవచ్చు. అయ్యప్ప స్వామి చేతిలో మరణించిన మహిషి బాధతో కార్చిన కన్నీరే అళదా నదిగా మారిందని చెబుతుంటారు. ఈ నదిలో స్నానం చేసి భక్తులు నదినుండి ఒక రాయిని తీసుకు వెళతారు. ఆ రాతిని "కళిద ముకుంద" (మహిషి కళేబరాన్ని పూడ్చిన చోటు) వద్ద పడవేస్తారు. తరువాత యాత్ర ముందుకు సాగి కరిమల చేరుకుంటారు. అడవిదొంగ ఉదయనన్‌కి పెట్టని కోటలా ఈ అటవీ ప్రాంతం ఉపయోగపడేదని అంటుంటారు. కరిమలను దాటుకున్న తరువాత పవిత్రమైన 'పంబ నది' చేరుకుంటారు. ఇక్కడే 'పంబ గణపతి' ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఇక్కడే "పంబ" అనే గ్రామం కూడా ఉంది. ఇక్కడినుండి స్వామి సన్నిధానానికి ఏడు కిలోమీటర్ల దూరం. నీలిమల, అప్పాచిమేడులను దాటుకున్న తరువాత స్వామి సన్నిధానం చేరుకోవచ్చు. వెళ్తూ వెళ్తూ శరంగుత్తిలో ఎరుమేలి నుంచి స్వాములు తమ వెంట తెచ్చుకున్న బాణాలను ఇక్కడ వదిలి వెళ్తుంటారు.

అయ్యప్ప శ్లోకాలను బిగ్గరగా పలుకుతూ ముందుకెళ్లే భక్తులు అయ్యప్పస్వామి గుడికి ఉన్న పద్దెనిమిది మెట్లు, మోక్షము అనే మేడకు ఉన్న పద్దెనిమిది మెట్లుగా నమ్ముతుంటారు. ఈ పద్దెనిమిది మెట్లను ఎక్కి స్వామిదర్శనం చేసుకుంటే మానవ జీవితానికి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. భూత, గణాలకు అధినాయకుడైన అయ్యప్ప స్వామివారిని పవిత్రంగా పూజించిన వారికే ఆయన 'అభయముద్ర' లభిస్తుంది. స్వామివారి అభయముద్ర లభించిన వారికి ప్రశాంతమైన జీవితం, శాంతి, సౌభాగ్యాలు దరిచేరుతాయి. సముద్రమనే భక్తి మార్గంలో ఒక్కొక్కరు ఒక్కో నీటిచుక్కై కలిసిపోతే.. వారి వారి ఉనికిని, అహాన్ని, గతాన్ని, జరుగుతున్న కాలాన్ని, జరగబోయే కాలాన్ని అన్నింటినీ మర్చిపోవడం ఖాయం. అలాంటప్పుడు అందరి మనస్సుల్లో కొలువై ఉండే మూడే మూడు పదాలు "స్వామియే శరణం అయ్యప్ప" మాత్రమే.